logo

కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి,కుమార్తె కావ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్న కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు సీనియర్ నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు.

ఇటీవల వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కావ్య, పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఆ మేరకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆమె ఒక లేఖ రాశారు.

కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు, దిల్లీ మద్యం కుంభకోణం లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని ఆమె అందులో ఆరోపించారు. జిల్లాలోని పార్టీ నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం పార్టీకి నష్టం చేస్తుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకొన్నట్లు చెప్పారు.

కడియం శ్రీహరి ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

0
293 views